తన ఆస్తుల వ్యవహారంపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడంతో దానిని ఎదుర్కోవడంపై తెలుగుదేశం అధినేత , ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో శ్రధ్ద వహించారు.తెలుగుదేశం పార్టీ నేతలు నిజానికి ముందుగా ఈ పరిణామాన్ని ఊహించలేదు. దాంతో తొలుత కాస్త దిగ్బ్రాంతికి గురి అయినా, ఆ తర్వాత కోలుకోని దానిని ఎదుర్కునే విషయంపై వ్యూహరచన చేసుకున్న తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి వెంటనే ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.ఒక్కో బృందంలో ఇద్దరు లేదా ముగ్గురు నేతలను నియమించారు. వీరికి తనపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ వేసిన పిటిషన్ లోని ముఖ్యాంశాలను విడదీసి సబ్జక్టులవారీగా కేటాయించారు. వాటికి సంబంధించిన జీఓలు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను సిద్దం చేసుకునే బాధ్యతను వారికి అప్పగించారు. వాటినన్నిటిని అధ్యయనం చేయడమే కాకుండా విజయమ్మ వాదనలోని బలహీనతలను బయటపెట్టి ప్రజలకు వివరించడం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.ఒకవైపు న్యాయపరంగా ఎదుర్కోవడానికి సన్నద్దం అవుతూనే , మరో వైపు ప్రజాక్షేత్రంలో తమ వాదనలను బలంగా వినిపించడానికిగాను రోజూ మీడియా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. తదనుగుణంగా గత వారం రోజులుగా నిత్యం ఏదో ఒక అంశంపై టిడిపి నేతలు తమ వాదనలు
వినిపిస్తూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన మనసులోని ఆవేదనను సోమవారంనాడు బయటపెట్టారు. హైకోర్టు లో వెకేట్ పిటిషన్ పై అనుకూలంగా నిర్ణయం వస్తే ఫర్వాలేదు. లేకుంటే దానిని ఎదుర్కోవడానికి వీలుగా టిడిపి ఈ విధమైన వ్యూహరచన చేసింది. అది ఫలిస్తుందా? లేదా అన్నది చూడాలి.
No comments:
Post a Comment