Powered By Blogger

Thursday, 8 December 2011

అవిశ్వాసంతో బయటపడ్డ పార్టీల బలాబలాలు

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తీరు ప్రభుత్వానికి బలాన్ని ఇచ్చిందా? ప్రభుత్వ బలహీనత బయటపడిందా?తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ముందడుగు వేసిందా?లేక ఆ పార్టీకి ప్రత్యేకమైన లాభం రాలేదా? వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పిన మాటలకు ,ఆ పార్టీకి లభించిన మద్దతుకు పొంతన లేకపోవడం నష్టం తెచ్చిందా?మొత్తం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులలోఏర్పడిన గజిబిజిలో స్పష్టత వచ్చిందా అన్నది పరిశీలించడం ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవిశ్వాస తీర్మానం లో స్వల్ప ఆధిక్యత తోనైనా గట్టెక్కడం ఆయనకు ఊపిరి పీల్చుకున్నట్లయింది.కచ్చితంగా కిరణ్ కూడా జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో తనదైన శైలిలో కృషి చేశారు.కొందరు ముఖ్యమైన జగన్ మద్దతుదారులు అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి, కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి వంటివారినే కాకుండా కడప జిల్లాకే చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని కిరణ్ ఆకర్షించడం ద్వారా జగన్ పై కిరణ్ తన ఆధిక్యతను ప్రదర్శించుకోగలిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి నలభై నుంచి ఏభై వరకు కచ్చితంగా ఎమ్మెల్యేలు వెళ్లిపోతారనుకున్న పరిస్థితి నుంచి ఇరవైలోపునకే తగ్గించడంలో కిరణ్ కుమార్ రెడ్డి సఫలం అయ్యారనే అనుకోవాలి. కాని అదే సమయంలో అధికారాన్ని వదలిపెట్టుకుని కూడా ఒక వ్యక్తి వెనుక ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండడం అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనతగానే పరిగణించాలి. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతవరకు బాధ్యుడన్న ప్రశ్న రావచ్చు. పిసిసి అధ్యక్షుడు బొత్స ఎంతవరకు కారకుడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు.అది వేరే విషయం.సాధారణంగా అధికారాన్ని వదలి వెళ్లడానికి ఈరోజులలో ఇష్టపడరు.అలాంటిది ఏకంగా పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక ప్రజారాజ్యం ఎమ్మెల్యే కాంగ్రెస్ ను కాదని జగన్ పార్టీకి మద్దతుగా నిలబడడాన్ని తక్కువగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేయజాలదు. ఒక దశలో కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేలే ఉంటారని కాంగ్రెస్ వ్యూహకర్తలు అంచనావేశారు.తుది ఫలితం వచ్చేసరికి అది తప్పని తేలింది.అయితే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విప్ ను ఉల్లంఘించిన వారిపై వేటు వేయాలా? వద్దా అన్న సంశయం కాంగ్రెస్ లో నెలకొంది. అంటే దీనిని కచ్చితంగా కాంగ్రెస్ బలహీనతగానే తీసుకోవాలి.మామూలుగా అయితే ఈసరికి అనర్హత వేటు వేయడానికి స్పీకర్ కు ఫిర్యాదు పత్రాన్ని సిద్దం చేయాలి. కాని అలా చేయలేకపోవడం కాంగ్రెస్ నిస్సహాయ పరిస్థితిగానే భావించాలి. ప్రజారాజ్యం, ఎమ్.ఐ.ఎమ్. మద్దతు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టెక్కడం కష్టం అయ్యేదన్నది సందేహాలకు అతీతంగా రుజువు అయింది.ఇప్పుడు కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత తనదేనని ప్రజారాజ్యం మాజీ అధినేత , మెగాస్టార్ చిరంజీవి క్లెయిమ్ చేస్తారు.దానికి కాంగ్రెస్ కూడా అంగీకరించకతప్పదు. కాంగ్రెస్ అధిష్టానంలో చిరంజీవికి కాస్త వెయిట్ పెరుగుతుంది. కిరణ్, బొత్సల కన్నా, ఇప్పుడు చిరంజీవికి అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు.ఏతావాతా కిరణ్ ప్రభుత్వం నిలబడడం ఆయనకు మేలు కలిగించిన అంశం అయితే, చిరంజీవికి డిమాండ్ పెరగడం ముఖ్యమైన అంశంగా తీసుకోవాలి. ఇదే సమయంలో కిరణ్ ప్రభుత్వం సుస్థిరంగా రాజకీయ సంక్షోభాలేవి లేకుండా నడుస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతాయి.అది కిరణ్ వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో కొన్ని కష్టాలు ఇబ్బందులు తప్పవు. ఎమ్మెల్యేల డిమాండ్లను , కోర్కెల చిట్టాను నెరవేర్చవలసిన బాధ్యత కిరణ్ పై పడుతుంది. ఈ క్రమంలో కొన్ని తప్పులు జరగవచ్చు. ఒకవైపు ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ, మరో వైపు ప్రజాక్షేత్రంలో అప్రతిష్టపాలు కాకుండా చూసుకోవలసిన బాధ్యత కిరణ్ పై పడుతుంది. ఇక మంత్రి వర్గ విస్తరణకు కాస్త అనుకూల వాతావరణం ఏర్పడినా, కిరణ్ పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది.దానిని తట్టుకుని , తనకు ఇష్టం లేని కొందరు మంత్రులను తొలగించి , ఇష్టైమైన వారిని వేసుకోవడానికి అధిష్టానం అనుమతించాల్సి ఉంటుంది.ఇవన్ని కూడా కిరణ్ కుమార్ రెడ్డికి భవిష్యత్తులో
ఎదురయ్యే సవాళ్లనే చెప్పాలి.అనర్హత వేటు విషయంలో ముందుకు వెళితే వాటన్నిటికి ఉప ఎన్నికలు వస్తాయి. అది కిరణ్ కు ప్రధాన పరీక్ష అవుతుంది. అనర్హత వేటు వేయకపోయినా, వేసినా, రెండు కూడా కిరణ్ కు పరీక్షలే అవుతాయని చెప్పాలి. అయితే వీటిని అధిగమించి, కిరణ్ కుమార్ రెడ్డి కనుక ఉప ఎన్నికలలోమెజార్టీ స్థానాలు తెచ్చుకోగలిగితే ఆయనకు తిరుగు ఉండదు. అలాకాకపోతే మాత్రం రాజకీయంగా కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది.మొత్తం మీద కిరణ్ ప్రభుత్వం బలం ఏమిటో, బలహీనత ఏమిటో ఈ అవిశ్వాస పరీక్ష స్పష్టంగా బయటపెట్టిందని చెప్పవచ్చు.
ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస పరీక్ష ఒక రకంగా తనపై రాజకీయంగా వచ్చిన అభియోగాలను క్లియర్ చేసుకవడానికి ఉపయోగపడిందని చెప్పాలి. అయితే ఆరు నెలల క్రితం సభలో అవిశ్వాస పరీక్ష వచ్చేలా చేయకుండా,తర్వాత పరిస్థితులు మారాక సిద్దం అయ్యారని విమర్శలు వచ్చినా, ఏ రాజకీయపార్టీ అయినా తనసొంత ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది కాని, వేరేపార్టీలు చెప్పినట్లు చేయదు కదా.అంతవరకు చంద్రబాబు ఇబ్బంది పడలేదు. అయితే ఒక వేళ నిజంగానే విప్ ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తే అప్పుడు టిడిపికి కూడా పరీక్ష అవుతుంది. ప్రధానంగా ఇటీవలి సర్వేలలో టిడిపి పరిస్థితి కూడా అంత సజావుగా లేదన్న సమాచారం వస్తున్న నేపధ్యంలో వీరికి కూడా సహజంగానే ఆందోళన కలుగుతుంది.ప్రత్యేకించి తెలంగాణలో ఇంకా టిడిపి కోలుకుందని చెప్పేపరిస్థితి కనబడడం లేదు. కాంగ్రెస్ కు తామే ప్రదాన పోటీ అన్న నమ్మకాన్ని కలిగించగలిగితేనే టిడిపికి ఉపయోగం ఉంటుంది.అయితే చంద్రబాబుకుగాని, టిడిపికి గాని అవిశ్వాస పరీక్ష వ్యవహారం కన్నా సిబిఐ విచారణే ముఖ్యమైన అంశంగా గమనించాలి.దాని నుంచి క్షేమంగా బయటపడితే అప్పుడు టిడిపి బాగా పుంజుకోలుగుతుంది.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికాని, ఆయన పార్టీ నేతలు నిజానికి ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగులో తమ బలాన్ని చాటుకోవడంలో విఫలమైనట్లే లెక్క. అత్యంత సన్నిహితులను కూడా కోల్పోవడం కొంత వరకు నష్టమైనని చెప్పాలి.యాజమాన్య నిర్వహణ సరిగా లేదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి.జగన్ ఓదార్పు యాత్రలోనే ఎక్కువగా కొనసాగడం, ఎమ్మెల్యేలతో నిరంతరం టచ్ లో లేకపోవడం వంటి లోపాలను ఆ పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. చివరి నిమిషంలో జగన్ రంగంలో దిగి తన బలాన్ని పందొమ్మిదిగా చూపించుకోవడం ద్వారా అవిశ్వాస తీర్మానం ఓడిపోయినా, జగన్ కు ఇప్పటికీ ఇంత బలం ఉందా అన్న అభిప్రాయం రావడంతో ఆయన పరిస్థితి మరీ దెబ్బతినలేదని చెప్పాలి. ఆయనపార్టీ నాయకులు కిందపడ్డా తమదే పైచేయి అనడానికి ప్రయత్నిస్తున్నారు.జగన్ కూడా దమ్ముంటే ఈ పదిహేడు నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని సవాలు విసరడం ద్వారా జనానికి తనపై విశ్వాసం కోల్పోకుండా జాగ్రత్తపడుతున్నారని అనుకోవాలి.అయితే ఏమాటకామాట ఒప్పుకోవాలి. ఎవరైనా ఎమ్మెల్యేలను ఆయన కట్టడి చేయకుండా అవిశ్వాసానికి ఓటు వేసేవారే తన మనుషులని ధైర్యంగా చెప్పిన తీరును మాత్రం మెచ్చుకోవాలి.కాని అదే సమయంలో తొలి నుంచి ఉన్న సుమారు నలభై మంది ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడంలో సఫలం కాకపోవడం కారణం ఏదైనా ఆయన బలహీనతగా పరిగణించాలి.అనకాపల్లి ఎమ్.పి సబ్బం హరి ఎప్పుడూ అవిశ్వాసం పెడితే సత్తా చూపుతామని, ప్రభుత్వం పడిపోతుందని చెబుతూ వచ్చేవారు. అలాంటివారికి ఈ పరిణామం కాస్త ఇబ్బందికరమే. అయినప్పట్టికీ ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానికి జగన్ సిద్దం అవడం కూడా మంచిదే.ఉప ఎన్నికలు జరిగి తన పక్షానికి అత్యధిక సీట్లు వస్తే ఇక భవిష్యత్తులో జగన్ రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నట్లే లెక్క. అలా కాకుండా తక్కువ సీట్లకే పరిమితమైతే అప్పుడు జగన్ భవిష్యత్తు డోలాయమానంలో పడుతుంది. ఇక టిఆర్ఎస్ పార్టీ కి ఈ అవిశ్వాసం పెద్దగా లాభం కాని, నష్టం కాని తేలేదు. కాకపోతే తెలంగాణకు చెందిన ఇతర పార్టీ ల నేతలను అవిశ్వాసానికి అనుకూలంగా చేయడంలో సఫలం కాలేకపోయారు.అయితే ఉప ఎన్నికలు వస్తే తమ సత్తాను తెలంగాణలో చాటాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే అసలు ఉప ఎన్నికలు వస్తాయో , రాని తెలియని పరిస్థితి నెలకొంది.ఏది ఏమైనా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను అవిశ్వాస తీర్మానం బహిర్గతం చేసిందని చెప్పుకోవాలి.                            

No comments:

Post a Comment