వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది ఎమ్మెల్యేలను నిలబెట్టుకుంటారని కాంగ్రెస్ , టిడిపి ముఖ్యనేతలు భావించారు? పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను నిలబెట్టుకోవడంపై వారు ఎలా స్పందిస్తున్నారు? అవిశ్వాస తీర్మానంపై చర్చ రసపట్టుకు చేరుకున్నప్పుడు ఒక దశలో శాసనసభ ప్రాంగణంలో తెలుగుదేశం, కాంగ్రెస్ ముఖ్యనేతలు జగన్ కు మద్దతు ఇస్తున్నవారి సంఖ్య సింగిల్ డిజిట్ కుపడిపోయిందని భావించారు. తెలుగుదేశం ముఖ్యనేత ఒకరైతే జగన్ బలం ఐదారుకన్నా ఉండదని తనకు సమాచారం వచ్చిందని అన్నారట. అది కూడా వైఎస్ విజయమ్మతోపాటు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కడప జిల్లాకు చెందిన ఒకరిద్దరు మాత్రమే మిగులుతారని వారు భావించారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు సైతం ఇదే మాదిరి పదిలోపే ఉంటుందని అనుకున్నారు.అయితే రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మాత్రం జగన్ కు మద్దతు ఇచ్చేవారి సంఖ్య పదిహేడు వరకు ఉండవచ్చని లెక్కగట్టారు. అయినప్పట్టికీ చివరివరకు అంతమంది ఉండకపోవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకున్నారు. కాని విజయమ్మతో సహా పందొమ్మిది మంది ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతు ఇచ్చారని తేలడంతో ఒక్కసారే ఆశ్చర్యపోయారట. తమకైతే ఒక్కసారే ఉలిక్కి పడినట్లయిందని తెలుగుదేశం నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. డెబ్బైమంది ఎమ్మెల్యేలు ఉంటారని జగన్ గతంలో చెప్పిన పాయింటు ఆధారంగా తాము విమర్శలు చేసినా, పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు జగన్ కు మద్దతు ఇవ్వడం కచ్చితంగా తమను ఆలోచింపచేసేదే అయిందని ఆయన అన్నారు. అలా గే కాంగ్రెస్ నేతలు సైతం ఈ పరిణామానికి ఉలిక్కిపడ్డారు.అందువల్లనే ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడానికి వెనుకా,ముందు అయ్యే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ధైర్యంగా కాంగ్రెస్ నేతలు తాము విప్ ఉల్లంఘించినవారిపై అనర్హత వేటు వేయబోతున్నామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారని చెబుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే వారు ఇలా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు.
No comments:
Post a Comment