తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపైన, అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ పై సిబిఐ విచారణ జరుగుతుండడంతో వీరిద్దరిని అరెస్టు చేసే అవకాశం ఉందా అన్నదానిపై రాజకీయ వర్గాలలో , ఇతరత్రా ఆసక్తకరమైన చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో కాస్త అతివాదులుగా ఉండే నాయకులేమో చంద్రబాబు, జగన్ ఇద్దరూ అరెస్టు అవుతారని ప్రచారం చేస్తున్నారు.కాని మరికొందరు మాత్రం అలా జరగకపోవచ్చని భావిస్తున్నారు. అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ నేత జగన్ అరెస్టు అయితే చంద్రబాబు నాయుడు కూడా అరెస్టు అవుతారని, అలా కాకుంటే ఇద్దరూ అరెస్టు కారని వాదిస్తున్నారు. జగన్ కు చంద్రబాబుకు పోలిక పెట్టడం సరికాదని, చంద్రబాబు ఎనిమిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని, గత ఏడున్నర ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారని, గతంలో ఆయనపై ఎన్ని ఆరోపణలు చేసినా రుజువు కాలేదని టిడిపి నేతలు కొందరు వాదిస్తున్నారు. అయితే జగన్ తరపు వాదించేవారు ఒక సంగతి చెబుతున్నారు. అసలు అధికారంలోనే లేని వ్యక్తిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని,అదే చంద్రబాబు అధికారంలో ఉండి అనేక ఆరోపణలకు గురి అయ్యారని ఒక్క కేసులో కూడా ఆయనకు క్లీన్ చిట్ రాలేదని అంటున్నారు. ఒక సీనియర్ ఐఎఎస్ అదికారి ఇచ్చిన వివరణ ప్రకారం బహుశా జగన్ ఎన్నడూ అధికారం లేరు కనుక క్విడ్ ప్రొకో కింద కేసు వర్తించకపోవచ్చని, అలాగే చంద్రబాబు
ముఖ్యమంత్రి పదవి నిర్వహించి ఏడున్నర ఏళ్లు అయినందున ఇప్పుడు కేసులు పెట్టడంలో హేతుబద్దత ఉండకపోవచ్చని , అందువల్ల ఇద్దరు జైలు వరకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇద్దరు ముఖ్యనేతలను జైలులో పెట్టి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లగలుగుతుందా అన్నది అనుమానమేనని మరో రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ రెండు కేసులు రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి.
No comments:
Post a Comment